ఏపీలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష వైసీపీల మధ్య సాగుతున్న రాజకీయం ఢిల్లీకి చేరింది. నేటీ నుంచి జరుగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఏపీ రాజకీయాల రచ్చకు టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమయ్యాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ ఇప్పటికే మార్గనిర్ధేశం చేశారు. తాడేపల్లిలోని నివాసంలో తన పార్టీ ఎంపీలతో సమావేశమైన జగన్ ఢిల్లీలో తాను చేయబోయే ధర్నాపై వారితో చర్చించారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపైన జరుగుతోన్న దాడులు, హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం, దేశం దృష్టి తీసుకెళ్లాలని సూచించారు. పార్లమెంటులో ఈ సమస్యలపై వైసీపీ ఎంపీలు గళం వినిపించాలని సూచించారు. ఉభయ సభల్లో ఏవిధంగా వ్యవహరించాలో ఎంపీలకు మార్గదర్శకం చేశారు. వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను దేశవ్యాప్తంగా తెలియజేయాలని జగన్ సూచించారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని వైసీపీ ఎంపీల సమావేవంలో జగన్ నిర్ణయించారు. మరోవైపు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి అధికంగా నిధులు రాబట్టడానికి, కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిగా ఉండేందుకు ఎంపీలందరికి బాధ్యతలను ఖరారు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ ఢిల్లీలో చేయనున్న రాజకీయానికి కౌంటర్ ప్లాన్‌లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. మొత్తంగా దేశ రాజధానిలో అటు జగన్ ధర్నా ఏపీ రాజకీయాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లనుండగా, ఇటు పార్లమెంటులో టీడీపీ, వైసీపీ ఫైట్‌కి రంగం సిద్ధమైంది. దీంతో ఢిల్లీ పొలిటికల్ స్క్రీన్‌పై ఏపీ పొలిటికల్ సినిమా రచ్చకు కౌంట్‌డౌన్ షురూ అయింది.
హస్తిన వేదికగా ఏపీ రాజకీయం … పార్లమెంటు వేదికగా టీడీపీ, వైసీపీ బిగ్ వార్..!
RELATED ARTICLES